chiru: అప్పట్లో రాజగోపురం కూలిపోవడంతో ఎంతో ఆవేదన చెందా.. ఇప్పుడు సంతోషంగా ఉంది: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయ రాజగోపుర మహాకుంభాభిషేకం క్రతువులో భాగంగా విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రాజగోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే, గతంలో శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవ రాయలు నిర్మించిన రాజగోపురం కూలిపోవడంతో తాను ఆవేదన చెందినట్లు చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. ఆ రాజగోపుర పునర్నిర్మాణం కోసం తాను అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడానని తెలిపారు. అయితే, ఆ సమయంలో నవయుగ నిర్మాణ సంస్థ వారు ముందుకు వచ్చారని తనకు సమాచారం అందిందని, దీంతో తాను ఎంతో ఆనందపడినట్లు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ రాజ గోపురం దక్షిణ భారతదేశానికే తలమానికం అని చిరు వ్యాఖ్యానించారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవయుగ నిర్మాణ సంస్థ అధినేత చింతా విశ్వేశ్వరరావు రాజగోపుర నిర్మాణాన్ని ఎంతో వేగంగా పూర్తి చేశారని ఆయన ప్రశంసించారు. రాజగోపురం మహాయజ్ఞంలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొనాలని తనకు ఆయన రెండు నెలల క్రితం ఫోన్ చేశారని ఆయన తెలిపారు. విశ్వేశ్వరరావును ఆయన అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా అభివర్ణించారు. ఈ యాగంలో తాను కూడా పాల్గొన్నందుకు ఆత్మసంతృప్తి కలిగిందని అన్నారు.