sehwag: పది రెట్లు పన్ను వసూలైంది.. హహ్హహ్హహ్హ! : చమత్కారాలతో కోహ్లీకి సెహ్వాగ్ ప్రశంసలు
నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ముందు ఇంగ్లండ్ ఉంచిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛేదించడం పట్ల పలువురు ప్రముఖులు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురింపించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 105 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. మరోవైపు జాదవ్ కూడా ధాటిగా ఆడి 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. ఈ విజయంపై స్పందించిన మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ‘పది రెట్లు పన్ను వసూలైంది.. హహ్హహ్హహ్హ! (దస్ గుణా లగాన్ వసూల్!)’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు ఇదే అంశంపై సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్, ప్రముఖ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లు ఈ ఏడాది తొలి విజయం సాధించారని పేర్కొన్నారు. ఇలాగే విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. కోహ్లీ, జాదవ్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపించారని అన్నారు. అత్యుత్తమ టెస్టు, వన్డే, టీ20 ఆటగాడు కోహ్లీ అని పేర్కొన్నారు. కోహ్లీని క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోల్చారు.