supreme court: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మరోసారి చర్చనీయాశంగా మారింది. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా 24 మంది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజనను అధిక శాతం మంది ప్రజలు కోరుకోలేదని కిరణ్‌కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.
విభజన చట్టం పాసైన తరువాత కూడా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం భావ్యం కాదని, ఆ మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌ల తరఫు న్యాయవాది అన్నారు. రాష్ట్ర విభజన సమాజ స్ఫూర్తికి భిన్నంగా జరిగిందని, సమాజానికి విఘాతం కలిగించారని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తోందని, ఈ దశలో తాము చేయగలిగింది ఏముందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాష్ట్ర విభజనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.