keshi neni nani: పవన్ కల్యాణ్‌కి నా మీద ద్వేషం కాదు.. ఎంతో ప్రేమ ఉంది: కేశినేని నాని
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. 'మీరంటే పవన్ కల్యాణ్‌కి ప్రేమంటారా? లేక ద్వేషం అంటారా?' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, పవన్‌కి తనంటే ప్రేమేనని అన్నారు. అయితే, 'ఆంధ్ర ఎంపీలకు ఇంగ్లీషు రాదని, అందుకే ప్రత్యేక హోదా గురించి అడగలేకపోతున్నారని పవన్ అంటున్నారు కదా?' అని యాంకర్ అడగగా ప్రేమ ఎక్కువయినా కూడా అలాగే మాట్లాడతారని కేశినేని నాని చమత్కరించారు. ఆయనకు కచ్చితంగా తనపై ప్రేమే ఉండి ఉంటుందని చెప్పారు.
తనకు ఇంగ్లీష్, హిందీ మాట్లాడడం వస్తుందన్న విషయం తన గురించి తెలిసిన వారికి తెలుసని కేశినేని నాని అన్నారు. తాను, పవన్ కల్యాణ్ ఎప్పుడూ డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్ మంచి రాజకీయ నాయకులకే సపోర్ట్ చేస్తారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు కాబట్టే పవన్ ఆయనకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారనే తాను అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌తో ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, అయితే చిరంజీవి ఎదురుపడితే మాత్రం తాను ఆయనతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు.