amar singh: దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నా.. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు తిరిగి రాను: అమర్ సింగ్ ప్రకటన
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాల వల్ల సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీకి తానే అధినేతనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ ప్రకటించుకున్న తరువాత ఆ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన తిరిగి విదేశాలకు వెళ్లిపోతానని, మళ్లీ యూపీ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు రానని ప్రకటించారు.
ములాయం సింగ్‌కు మద్దతుదారుడిగా ఉన్న అమర్ సింగ్ పై కోపంగా ఉన్న అఖిలేష్ తమ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాలని కొన్ని రోజుల ముందు డిమాండ్ చేశారు. అయితే ములాయం అందుకు ఒప్పుకోలేదు. అయితే, ఇప్పుడు అఖిలేష్ డిమాండ్ పట్ల ములాయం సానుకూలంగా స్పందిస్తూ సంకేతాలిస్తుండడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న అమర్ సింగ్.. తాను ఇక దూరంగా వెళ్లిపోతానని ప్రకటించారు.
తన ఆరోగ్యం బాగుపడేందుకు చికిత్స కోసం లండన్, సింగపూర్ దేశాలకు వెళ్తున్నట్లు అమర్ సింగ్ చెప్పారు. తమ పార్టీలో చీలికలు వస్తే కనుక తాను, జయప్రద ఏ వర్గంలోనూ ఉండబోమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.