asaduddin: తమ ఇంటినే సరిదిద్దుకోలేని పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది?: సమాజ్‌వాదీ పార్టీపై అసదుద్దీన్ ఒవైసీ విమ‌ర్శ‌లు


ఉత్తరప్రదేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ రాష్ట్రంలో వ‌చ్చేనెల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో షామ్లి జిల్లాలోని కైరానాలో త‌మ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయ‌న... ఎన్నికలు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలోనే సమాజ్‌వాదీ పార్టీకి మైనారిటీలు గుర్తుకు వ‌స్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను కేవ‌లం ఓటు బ్యాంకులుగా ఉప‌యోగించుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశంలోని ముస్లింలకు చెందిన ఒకే ఒక్క‌ పార్టీ మజ్లిస్ మాత్రమేన‌ని ఉద్ఘాటించారు. 2013లో ముజఫర్‌నగర్‌లో చెల‌రేగిన అల్లర్లలో ముస్లింలు రక్తం చిందించారని ఆయ‌న అన్నారు. కాగా, ఆ రాష్ట్ర అధికార పార్టీ మాత్రం నాటి ఘటనను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని నిప్పులు చెరిగారు.

 సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్య పోరుపై అసదుద్దీన్ మాట్లాడుతూ... ఆ పార్టీ త‌మ ఇంటినే చ‌క్కదిద్దుకోలేకపోతోంద‌ని, ఇక ప్ర‌జ‌ల‌ కోసం ఏం పోరాటం చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల దృష్ట్యా మాత్ర‌మే మైనారిటీలపై వ‌రాల జ‌ల్లు కురిపిస్తూ హామీలిస్తుంటాయని ఆయ‌న ఆరోపించారు. మస్లిజ్ పార్టీకి అక్క‌డి ప్ర‌జ‌లు ఓటు వేసి, త‌ద్వారా ప్ర‌జ‌లు తమ గొంతును ప్ర‌భుత్వాల‌కి బలంగా వినిపించాలని చెప్పారు. ఆ రాష్ట్ర‌ అసెంబ్లీ ఎన్నికల్లో కరైనా నియోజకవర్గానికి చెందిన మసియుల్లాతో సహా 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి దిగ‌నున్న త‌మ‌ పార్టీ అభ్యర్థుల జాబితాను మజ్లిస్ పార్టీ  విడుద‌ల చేసింది.

  • Loading...

More Telugu News