demonitisation: ఇక బ్యాంకు లాకర్లపై ఐటీశాఖ దృష్టి... ఆరువేల మందికి నోటీసులు.. నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు
దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతోంది. పెద్దనోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు బినామీ ఆస్తులపై దృష్టి పెట్టింది. పలువురు బినామీ పేర్లతో బ్యాంకు లాకర్లలో దాచిన నల్లధనం, నగలపై చర్యలు తీసుకునేందుకు మొదటి అడుగు వేసింది. వాటిని పరిశీలించాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులను రంగంలోకి దింపింది. నవంబర్ 8 తరువాత ఎక్కువ సార్లు లాకర్లు తెరిచిన వారి వివరాలను వారు బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఆయా లాకర్లు ఎవరివి? అనే విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్రం సర్కారు ప్రకటించింది.
ఇటీవల ఐటీ చేసిన దాడుల ఫలితంగా పన్ను చెల్లించని రూ.5,343 కోట్ల ఆస్తులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఐటీ శాఖ ఇప్పుడు బినామీ లాకర్లపై నిఘాను మరింత పటిష్టం చేసింది. నవంబరు 10 తరువాత బ్యాంకుల్లో తెరచిన కొత్త ఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంది. ఇప్పటికే ఆరువేల మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అంతేగాక వెయ్యిమందిపై దాడులు నిర్వహించామని, నల్లధనం ఉన్న 279 మందిపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.