obama: ‘నిజమైన రాజనీతజ్ఞుడిలా మాట్లాడతారు’.. మరికాసేపట్లో అధ్యక్షుడిగా ఒబామా చివరి కీలక ప్రసంగం
మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్షుడి పీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చుంటారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ రోజు ఆ దేశ అధ్యక్ష హోదాలో తన చివరి ప్రసంగం చేయనున్నారు. అంతేకాదు, ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఒబామా చివరిసారిగా ప్రయాణించనున్నారు. ఎనిమిదేళ్ల కిందట అగ్రరాజ్యం అధ్యక్షుడిగా చారిత్రక విజయం సాధించిన ఒబామా ఆ తరువాత నాలుగేళ్లకి జరిగిన ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించారు. తాను ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడయితే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో అదే షికాగోలో తన మద్దతుదారులను ఉద్దేశించి ఒబామా మాట్లాడనున్నారు.
ఈ సభకు ఒబామా అభిమానులు (ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్స్) భారీ ఎత్తున హాజరుకానున్నారు. ఈ సభకు రావాలనుకున్న వారికి మొదట టిక్కెట్లను ఉచితంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కోటిక్కెట్టుకి వెయ్యి డాలర్ల వరకూ తీసుకుంటున్నారు. వేదికపై అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన భార్య మిషెల్ ఒబామా, వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ కూడా కనపడనున్నారు. తన ప్రసంగంలో భాగంగా అమెరికా భవిష్యత్తుపై తన విజన్ గురించి కూడా ఒబామా మాట్లాడనున్నారు. ఈ కీలక ప్రసంగం డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేక ప్రసంగంలా ఉండబోదని, నిజమైన రాజనీతజ్ఞుడిలా ఆయన మాట్లాడతారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆ దేశ అధ్యక్షులు వీడ్కోలు ప్రసంగాలు చేయడం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ ప్రతి ఏడాది సెనేట్‌లో చదివి వినిపిస్తుంటారు.