uae: ఉద్యోగం కోసం అత్యంత అనువైన దేశాల జాబితా... యూఏఈకి టాప్–5లో చోటు!
విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకుంటున్న వారికి యూఏఈ చక్కని గమ్యస్థానంగా నిలుస్తోందని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది. సంపాదన, ప్రయోజనాల ప్యాకేజీల విషయంలో అక్కడి కంపెనీలు మంచి సదుపాయాలను అందిస్తున్నాయని సర్వే ఫలితంగా తెలిసింది. గత ఏడాది హెచ్ఎస్బీసీ నిర్వహించిన వార్షిక సర్వేలో ఆరో స్థానంలో ఉన్న యూఏఈ ఇప్పుడు మరో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక టాప్-3 దేశాల్లో వరసగా స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్లు ఉన్నాయి. సుమారు 27 వేల మంది అభిప్రాయాలు సేకరించిన ఈ సర్వేలో తమ సొంత దేశంలో కన్నా యూఏఈలో అధికంగా సంపాదిస్తున్నట్టు మూడింట రెండొంతుల మంది పేర్కొన్నారు. ఈ విషయంలో స్విట్జర్లాండ్ (75 శాతం మంది), ఖతార్ (66 శాతం) ముందు వరసలో నిలిచాయి.
ప్యాకేజీ విషయంలో తాము కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం కంటే కనీసం ఒక ప్రయోజనాన్ని అదనంగా పొందుతున్నట్లు మధ్యప్రాచ్య దేశాల్లోని 91 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. ఇది ప్రపంచ సగటు (67 శాతం) కన్నా ఎంతో ఎక్కువగా ఉండటం గమనార్హం.