sbi bank: ఈ-వ్యాలెట్‌కు నిధుల బదలాయింపును నిలిపేసిన ఎస్‌బీఐ.. సైబర్ దాడులే కారణమని వివరణ
ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఈ- వ్యాలెట్‌కు నిధుల బదలాయింపును నిలిపివేస్తున్నామని, ఇకపై తమ ఖాతాదారులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే వీటికి రీఛార్జి చేయించుకోవాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ అంశంపై సదరు బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ కోరగా... ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య స్పందిస్తూ... ఇటీవల పెరిగిపోయిన సైబర్ దాడులు, ఆన్‌లైన్ మోసాలే కారణమని తెలిపారు. అయితే, భవిష్యత్తులో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
అయితే, అరుంధతి భట్టాచార్య ఇచ్చిన వివరణపై ఈ-వ్యాలెట్ సంస్థలు ఘాటుగా స్పందించాయి. ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఎస్‌బీఐ బడ్డీ యాప్‌ను ఇప్పటికే 80 లక్షల మంది ఉపయోగిస్తున్నారని, ఆ సంఖ్యను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఆ బ్యాంకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు.