kcr: నల్లధనాన్ని మార్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
పెద్దనోట్ల రద్దు అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నల్లధనాన్ని మార్చుకునేందుకే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది ప్రజల కష్టాలను తీర్చేందుకు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండున్నర ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర సర్కారులు కనబరుస్తున్న తీరుతో ప్రజలు అసహనంతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు తాము ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను పక్కనబెట్టి గతంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన విమర్శించారు.
గతంతో తమ పార్టీ పాలనలో రైతులు, ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవారని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. సర్కారుల తీరుపై పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వారి పక్షాన తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా పేదలు ఎన్నో కష్టాలు పడ్డారని, నల్లకుబేరులు మాత్రం తమ డబ్బును ఏ కష్టం లేకుండా మార్చుకున్నారని ఆయన అన్నారు. వారి బాధలను తెలియజేస్తూ ఈ నెల 7న సూర్యాపేటలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.