demonitisation: శుభవార్త అందించిన ఎస్‌బీఐ... రుణ రేట్లు తగ్గింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతన సంవత్సరంలో తీపికబురు అందించింది. కొన్ని రోజుల క్రితమే స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్‌కోర్, ఐడీబీఐ రుణ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఎస్‌బీఐ కూడా పయనించింది. ప్రామాణిక రుణ రేటును 0.9 శాతం తగ్గించినట్లు పేర్కొంది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీరేట్లు (ఎంసీఎల్‌ఆర్) ఈ రోజు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుందని తెలిపింది. కాగా, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన రుణాలపై ఈ రేటును 9.05 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.