chandrababu: పోలవరంపై పెట్టిన ఖర్చులో కేంద్రం నుంచి ఇంకా రూ.217 కోట్లు రావాల్సి ఉంది: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2019 చివరి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పోలవరం కాంక్రీటు పనులను ప్రారంభించిన ఆయన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... 1.80 లక్షల మంది పోలవరం నిర్వాసితులున్నారని, వారందరికీ కొత్త చట్టం ప్రకారం పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. ముంపునకు గురయ్యే గ్రామాలు మొత్తం 262 అని చెప్పారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని చెప్పారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో 80 మెగావాట్ల కెపాసిటీ గల 12 యూనిట్లు వస్తాయని ఆయన చెప్పారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో కేంద్రం నుంచి ఇంకా రూ.217 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.
ఏ ఊరిలో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే ఒడిసి పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీని వల్ల భూగర్భ జలాలు పెరిగి.. నీటి కరవు అనే మాటే ఉండదని అన్నారు. నీటిని రక్షించుకుంటే భవిష్యత్తులో మనకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పారు. గోదావరి నది నీళ్లు కృష్ణా, పెన్నాలకి వెళ్లాలని, ఎక్కడికక్కడ నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్నే ఒక వాటర్ గ్రిడ్ గా తయారు చేసుకుంటే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చెప్పారు. దాని కోసమే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆ పనులు ముగిస్తే తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీటికొరత అనే మాటే ఉండదని చెప్పారు.