chandrababu: ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినా లాభం లేదని చెప్పాను: చంద్రబాబు
పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పోలవరం కాంక్రీటు పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు తొలిగిపోతుందని చెప్పారు. ప్రభుత్వ పాలనను అమరావతికి తీసుకొచ్చామని, రాష్ట్ర దశ, దిశ ఇక మారతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని అన్నారు. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను తెలంగాణలో కలపాలని విభజన చట్టంలో ఉంచిందని చెప్పారు
అసలు ముంపునకు గురయ్యే మండలాలని తెలంగాణలో వుంచి, పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే అది ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తాను అధికారంలోకి రాగానే తాను ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీకి వెళ్లి ఆ ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపాలని కోరినట్లు తెలిపారు. ముంపు మండలాలు కావాలని గట్టిగా పట్టుబట్టినట్లు చెప్పారు.
‘ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినా లాభం లేదని చెప్పాను. ఆ ముంపు మండలాలు నాకు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాను. చివరికి అవి ఏపీలో కలిశాయి. ఇప్పుడు మనం కలలు కన్న పోలవరం నిజమవుతోంది. పోలవరం పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే పోలవరం పనులు వేగంగా ముందుకు వెళుతున్నాయి. గోదావరి పుష్కరాల వేళ నేను గోదావరమ్మను కోరుకున్నది ఒక్కటే. పోలవరం పూర్తి కావాలని గోదావరి తల్లిని కోరుకున్నాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.