somi reddy: ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డిల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని కాకాని పలు డాక్యుమెంట్లు చూపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సోమిరెడ్డి ఈ రోజు ఉదయం విజయవాడకు వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకాని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాకానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తనకు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్‌లలో ఆస్తులు ఉన్నాయంటూ కాకాని ఎన్నో తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కల్తీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన కాకాని, ఇప్పుడు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఆయన ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని చెప్పారు. కాకాని చూపిస్తున్న డాక్యుమెంట్లు అన్నీ నకిలీవని సోమిరెడ్డి అన్నారు. నాలుగుదేశాల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి, వారి పార్టీకి సంబంధించిన మీడియాలోనూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు.
కాకాని చూపిస్తోన్న డాక్యుమెంట్లలో ఉన్న సంతకం తనది కాదని, అందులో తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. తాను 1998లో సింగపూర్ వెళితే డాక్యుమెంట్‌లో 2003లో వెళ్లినట్లు కూడా ఉందని అన్నారు. కాకాని టీడీపీలోకి రావాలని ప్రయత్నాలు కూడా చేశారని ఆయన అన్నారు. ఆయన తనపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు సృష్టిస్తున్నారో తనకు తెలియడం లేదని అన్నారు.