amejan: అమెజాన్ నుంచి వస్తువులు కొనడమే కాదు.. ఇకపై మీ వస్తువులను సైతం అమ్ముకోవచ్చు!
ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు సాగిస్తూ తమ కస్టమర్లకు వస్తువులను అందిస్తున్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇకపై తమ సైట్లో వినియోగదారులు కూడా తమ వస్తువులను అమ్ముకునే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ఇటువంటి సర్వీసులని ఓఎల్ఎక్స్, క్విక్కర్ లాంటి ప్రత్యేక వెబ్‌సైట్‌లు మాత్రమే అందిస్తున్న విషయం తెలిసిందే. తమ వస్తువులను అమ్మడమే కాకుండా తమ కస్టమర్లు కూడా తమ సైట్ ద్వారా వారి వస్తువులని అమ్ముకోవచ్చని ప్రకటించి అమెజాన్ వినియోగదారులను మరింత ఆకట్టుకుంటోంది. తమ వెబ్‌సైట్ ద్వారా వస్తువులను అమ్మాలనుకుంటున్న వారు మొదట ఏ వస్తువును అమ్మకానికి పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అమెజాన్ నిర్వాహకులు చెప్పారు.
అమ్మకానికి పెట్టిన వస్తువును కొనడానికి ఆసక్తిచూపి, ఎవరైనా ఆర్డర్ చేస్తే, తమ సంస్థ సిబ్బంది మొదట వస్తువును అమ్మకానికి పెట్టిన వారి ఇంటికి వెళ్లి ఆ వస్తువును ప్యాకింగ్ చేసి తీసుకెళతారని, అనంతరం ఆ వస్తువును ఆర్డర్ చేసుకున్న అడ్రస్‌కు డెలివరీ చేస్తారని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. ఆ వస్తువును తమ వెబ్‌సైట్ ద్వారా విక్రయించినందుకు గానూ అమెజాన్ సంస్థ కొంత నగదుని తీసుకుంటుంది. వస్తువును విక్రయించిన వారికి వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని తీసుకుంటుంది. తమ కస్టమర్లు తమ సంస్థ ద్వారా రూ.1000 లోపు ఉన్న వస్తువు అమ్మితే అందులోంచి 10 రూపాయలు తీసుకుంటామని అమెజాన్ నిర్వాహకులు చెప్పారు. అలాగే రూ.1000 నుండి రూ. 5000 మధ్యలో వస్తువుని విక్రయిస్తే 50 రూపాయలు తీసుకుంటామని, రూ. 5000 పైన ఉంటే 100 రూపాయలు ఫీజు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే ఈ సదుపాయాన్ని బెంగుళూరులో తీసుకువచ్చింది. కొన్ని రోజుల్లో భారత్‌లోని అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ నిర్వాహకులు చెప్పారు.