mla sunnam rajaiah: మాది ప్రజల తరఫున పోరాడే పార్టీ.. 'గుండుసూది' పార్టీ కాదు!: కేసీఆర్ పై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఫైర్
భూసేకరణ చట్టంలో సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా నిన్న శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలపట్ల సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చాలా అసభ్యంగా, వ్యంగ్యంగా తమ పార్టీని గుండుసూది పార్టీ అనడంతో పాటు పలు వ్యాఖ్యలు చేశారని సున్నం రాజయ్య అన్నారు. శాసనసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సీపీఎం పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజల తరఫున పోరాడే పార్టీ అని ఆయన అన్నారు. ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకునే పార్టీ అని చెప్పారు.
కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని రాజయ్య అన్నారు. ఈ విషయంపై తాము ఈ రోజు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇచ్చామని చెప్పారు. నిన్న భూసేకరణ చట్టం సవరణలపై చర్చ సందర్భంగా తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.