chandrababu: మార్పులేనిదే అభివృద్ధి లేదు.. నగదు రహిత లావాదేవీల వైపు మళ్లండి: చంద్రబాబు
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు, జన్మభూమిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఈ రోజు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, పలువురు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. మార్పులేనిదే అభివృద్ధి లేదని, ప్రజలంతా నగదురహిత లావాదేవీల వైపుకు మళ్లాలని, కొత్త సంవత్సరంలో కొత్త మార్పులకు నాంది పలకాలని ఆయన అన్నారు. ఆధార్ చెల్లింపులు, మొబైల్ లావాదేవీలు, స్వైపింగ్ మిషన్‌ల వినియోగం ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
డిజిటల్ కరెన్సీ ద్వారా పారదర్శకత పెరిగి, అవినీతి తగ్గుతుందని మరోవైపు ఉపాధి కూడా పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారని వారికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఈ వారంలో ఆన్‌లైన్ లావాదేవీలు 23 శాతంగా నమోదయ్యాయని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో ఆన్‌లైన్ లావాదేవీలు 50 శాతానికి చేరుకునేలా అధికారులు ప్రజలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.