rahul gandhi: షీలా దీక్షిత్ తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసుకోమంటున్నారు.. మరి మోదీ ఎందుకు అనడం లేదు?: రాహుల్ గాంధీ
'సహరా-బిర్లా' ముడుపుల విషయంలో కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పలువురి పేర్లను వెల్లడించిన తరువాత కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ వెల్లడించిన జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణలపై ఆయన ఎందుకు సమాధానం చెప్పడం లేదని అడిగారు. సహారా డైరీలో షీలాదీక్షిత్ పేరు కూడా ఉందని.. అయితే, ఆమె తనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారని, మరోవైపు మోదీ మాత్రం దర్యాప్తునకు సిద్ధమని చెప్పడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో దర్యాప్తు జరపాలని, దర్యాప్తులో ఈ ఆరోపణలన్నీ అసత్యమేనని వెల్లడయితే అది మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు.