dk aruna: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎంతో నెమ్మ‌దిగా సాగుతోంది!: డీకే అరుణ విమర్శ


తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఈ రోజు రెండు పడక గదుల ఇళ్లపై చర్చ కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా వాటిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. గత ప్రభుత్వాలు కూడా ఇళ్ల నిర్మాణ పథకాలు చేప‌ట్టాయ‌ని, అయితే వాటిల్లో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. వాటిని బయటపెట్ట‌డానికే తాము అధికారంలోకి రాగానే సీబీసీఐడీ విచారణకు ఆదేశించామ‌ని తెలిపారు. కట్టని ఇళ్లకు కూడా డబ్బులు కాజేసిన ఘ‌న‌త గ‌త‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడద‌నే తాము రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గృహ నిర్మాణ పథకంలో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌కూడ‌ద‌నే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. రాజ‌కీయ అవినీతి జ‌ర‌గ‌కూడ‌ద‌నే స‌ర్కారే ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకుంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో గృహ‌ నిర్మాణాలకు రూ.1766కోట్లు సమాకూర్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
 
అనంత‌రం కాంగ్రెస్ శాస‌న‌స‌భ స‌భ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ..  రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎంతో నెమ్మ‌దిగా కొన‌సాగుతోంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ఏర్ప‌డి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్ప‌టికీ ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రెండు పడక గదుల ఇళ్ల గురించి ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని, అవి ఇందిర‌మ్మ ఇళ్ల కంటే బాగుంటాయనే టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి గెలిపించారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్ర‌జ‌లు తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నార‌ని, అయితే ఇప్పుడు మాత్రం వారు నిరాశ‌తో ఉన్నార‌ని ఆమె విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News