chandrababu: పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును అందుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఓ వరమని, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 540 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నంలోని పరిశ్రమలకు నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు.
పోలవరం ద్వారా 950 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరవును కూడా అధిగమించవచ్చని చెప్పారు. 2018 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రికార్డు సమయంలో పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయం రంగంలో బీమాపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం కోసం తాము కృషి చేస్తున్నామని తెలిపారు.