venkaiah: పనులు పెంచాలంటే పన్నులు కూడా పెంచాల్సిందే : వెంకయ్య నాయుడు
పన్నులు ఇలా పెంచేస్తున్నారేంటి? అని కొందరు అంటుంటారని, పన్నులు పెంచితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చక్కగా ముందుకు కొనసాగుతాయని, తద్వారా దేశం బాగుపడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పనులు పెంచాలంటే పన్నులు కూడా పెంచాల్సిందేనని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆయన తెలంగాణ మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... మన చెత్తను మనమే ఎత్తేసుకోవాలని, పక్కింట్లో చెత్త వేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. దేశం ముందుకు వెళ్లాలంటే కేవలం ప్రధాని, ముఖ్యమంత్రులు కృషిచేస్తే సాధ్యంకాదని అన్నారు.
ప్రజలు కదిలివస్తేనే మార్పు సాధ్యమవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచిపోతున్నాయని కొందరు అన్నారని, నాలాలను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపడితే నీళ్లు ఎక్కడి నుంచి వెళతాయని వెంకయ్య ప్రశ్నించారు. అందుకే కేటీఆర్ అక్రమ నిర్మాణాలను కూల్చేయించారని చెప్పారు. రోడ్లు వెడల్పు చేయాలంటే వాటిని కూల్చేయాల్సిందేనని, గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కూడా రోడ్లను వెడల్పు చేయించారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చేస్తున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చేయవద్దని, ఉండేవాడిదే ఇల్లని, దున్నే వాడిదే భూమని కొందరు నినాదాలు చేస్తుంటారని, అయితే కడిగే వాడిదే ప్లేటా? అని ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో జిల్లాల్లో పెరగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అన్ని పనుల్లోనూ ప్రజలను భాగస్వాములు చేయాల్సి ఉందని చెప్పారు.