demonitisation: ఐటీ కొరడా.. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఇంట్లో సోదాలు
తమిళనాడులో ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులపై వరుసగా తనిఖీలు నిర్వహిస్తుండడం సంచలనం కలిగిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం 5.30 గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఐటీ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా ఉన్న శేఖర్‌రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో రామ్మోహన్‌రావుకు సంబంధించి పలు వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తిపై ఐటీ దాడులు జరపడం ఇదే ప్రథమం. ఐటీ అధికారులు అక్కడి మరికొంత మంది ప్రభుత్వ ఉన్నతాధికారులపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం.