demonitisation: జూన్ వరకు ఇంతే.. ఇబ్బందులు తప్పవని అనిపిస్తోంది : పెద్దనోట్ల రద్దుపై వైఎస్ జగన్
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయి, పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై గవర్నర్‌కి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు చూస్తుంటే నగదు కొరత కష్టాలు వచ్చే ఏడాది జూన్ వరకు ఇలాగే ఉంటాయని తెలుస్తోందని చెప్పారు. గవర్నర్ నరసింహన్ దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తాను ఆయనను కోరినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో రూ.12.41 లక్షల కోట్లు డిపాజిట్ చేస్తే కేవలం రూ. 5.5 లక్షల కోట్ల కొత్త కరెన్సీ మాత్రమే వచ్చిందని ఆయన అన్నారు.
ఏపీకి జనాభా ప్రకారం రావాల్సిన డబ్బు ఇంకా అందలేదని అన్నారు. డిసెంబరు 15 నాటికి రూ.14.740 మాత్రమే వచ్చాయని జగన్ చెప్పారు. కావాల్సిన కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోతే రైతులు, కూలీలు కష్టాలు ఎదుర్కుంటారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు కాబట్టి, తాను గవర్నర్‌ని కలిసి ప్రజల కష్టాలను పట్టించుకోవాలని వివరించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ కోరిన 50 రోజుల గడువు ముగిశాక కూడా కష్టాలు తీరకపోతే వెంటనే ఉద్యమిస్తామని తెలిపారు. పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల కొరతతో జనం నానా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న నాలుగే ప్రింటింగ్ ప్రెస్‌లలో 24 గంటలు ప్రింటింగ్ జరిగినా ఇప్పట్లో సమస్య తీరేలా లేదని అన్నారు. జూన్ వరకు సమస్య ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. పన్ను పెంచేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు అనిపిస్తోందని అన్నారు.