rahul gandhi: నోట్ల రద్దు తర్వాత మాల్యాకు మోదీ రూ.1200 కోట్ల కానుక ఇచ్చారు: రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన పరివర్తన్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు అదే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పర్యటిస్తున్నారు. జానుపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీపై ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దుతో మోదీ పేదల రక్తాన్ని తాగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతనెల మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం అవినీతిని అంతమొందించేందుకు కాదని, పేదలకు వ్యతిరేకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ ధనికులకు అనేక అవకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం, మరి రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నవంబరు 8 ప్రకటన తరువాత వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్యాంకు రుణమాఫీ ద్వారా నరేంద్ర మోదీ రూ.1200 కోట్ల కానుక ఇచ్చారని వ్యాఖ్యానించారు. రైతు రుణాలు మాఫీ చేయాలని తాము సర్కారుని కోరామని అయితే, ప్రధాని మాత్రం రైతు రుణమాఫీపై స్పందించలేదని ఆరోపించారు.