eetala: ఆనాడు నయీమ్ పై కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశాం.. పట్టించుకోలేదు: మ‌ంత్రి ఈట‌ల


తమ ప్రభుత్వం ఈనాడే కాదని, అసలు ఏనాడూ కూడా న‌యీమ్ లాంటి వారు చేసే అరాచ‌కాల‌ను స‌హించ‌బోద‌ని తెలంగాణ‌ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తెలంగాణ శాస‌న‌స‌భ‌లో గ్యాంగ్ స్ట‌ర్ న‌యీమ్ కేసుపై చ‌ర్చ కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఈటల రాజేంద‌ర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొంటున్న‌ప్ప‌టి నుంచే త‌మ‌కు, త‌మ నాయ‌కుడు కేసీఆర్‌కు ఎన్నో అంశాల గురించి తెలుసని అన్నారు. కాంగ్రెస్ హ‌యాంలోనే న‌యీమ్ ఆగ‌డాలు వెలుగుచూశాయని చెప్పారు. న‌యీమ్ ఆగ‌డాల‌పై అప్పుడు తాము మొత్తం ప‌దిసార్లు ఫిర్యాదులు చేసిన‌ట్లు చెప్పారు.

కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌మ‌ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదు చేశామ‌ని, అయినా వారు పట్టించుకోలేద‌ని ఈటల రాజేందర్ చెప్పారు. పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే ఇక మరెవరికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. న‌యీమ్ విష‌యంలో ఏనాడు ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఈనాడు ఏవేవో మాట్లాడుతున్నార‌ని అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ఇలాంటి వారి చ‌ర్య‌లను ఏ మాత్రం స‌హించ‌డం లేదని స్ప‌ష్టం చేశారు.

చ‌ట్టాన్ని న‌డిపించాల్సింది ప్ర‌భుత్వమే త‌ప్ప, నేర‌స్తులు కాదని కేసీఆర్ రుజువు చేస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క వ్య‌క్తి కోసం ఏనాడు ప‌నిచేయ‌బోద‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలోనే తాము అన్ని విష‌యాలు తెలుసుకున్నామ‌ని, ప్ర‌జ‌లను క‌ష్టపెట్టే వారిపై క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గులను ఎప్ప‌టికీ క్ష‌మించ‌దని స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News