demonitization: నల్లధనాన్ని మార్చుకోవడానికే మోదీని కలిశానని కూడా అన్నారు!: సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనంతరం తాను రూ.500, 1000 నోట్ల రద్దుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తరువాతే ఆ అంశంపై మాట్లాడానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రోజు తెలంగాణ శాసనమండలిలో పెద్దనోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను పెద్దనోట్ల రద్దుపై పలు వ్యాఖ్యలు చేశానని కొందరు అనుకున్నారని, తాను మోదీని కలిసి వచ్చి, రాష్ట్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి, హైదరాబాద్‌లో ఉన్న దువ్వూరి సుబ్బారావుతో మాట్లాడి అవగాహన తెచ్చుకున్న తరువాతే పెద్దనోట్ల రద్దుపై మాట్లాడానని సీఎం కేసీఆర్ అన్నారు.
తాను మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తన దగ్గరున్న నల్లధనాన్ని మార్చుకోవడానికే ప్రధాని మోదీని తాను కలిశానని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ లాంటి వారు అన్నారని కేసీఆర్ చెప్పారు. ఈ సమయంలో షబ్బీర్ అలీ సహా సభలో ఉన్నవారంతా చిరునవ్వులు చిందించారు. తాను ప్రధాని మోదీతో మొత్తం 70 నిమిషాలు మాట్లాడానని అన్నారు. మోదీకి అనేక విషయాలు చెప్పానని అన్నారు. నల్లధనం ఎన్ని రూపాల్లో ఉందో తాను మోదీకి చెప్పినట్లు తెలిపారు. పలు విషయాలను మోదీని అడిగి తెలుసుకున్నానని చెప్పారు.