4 pak apps: ఈ నాలుగు యాప్స్ వాడారంటే... ఇక మీ సమాచారం పాకిస్థాన్ చేతిలో పడ్డట్టే!
కశ్మీర్ లో ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్ల ద్వారా ఆశించిన స్థాయిలో భారత్ ను దెబ్బతీయలేకపోతుండడంతో, ఈసారి పాకిస్థాన్ అంతర్జాలాన్ని నమ్ముకుంది. భారత్ లోని పలు సైట్లను బ్లాక్ చేయించడం, హ్యాక్ చేయించడం ద్వారా కసి తీర్చుకునే ప్రయత్నం చేసింది. అయితే కాకలు తీరిన సాఫ్ట్ వేర్ నిపుణులున్న భారత్ పై పాక్ పన్నాగాలు పని చేయలేదు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ లో నాలుగు యాప్స్ పెట్టడం ద్వారా భారతీయుల సమాచారాన్ని సేకరించాలన్న పన్నాగానికి ఆ దేశం తెరలేపిందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. 'టాప్ గన్' అనే గేమింగ్ యాప్, 'యంపీ జంకీ' అనే మ్యూజిక్ యాప్, 'బీడీ జంకీ' అనే వీడియో యాప్, 'ట్రాకింగ్ ఫ్రాగ్' అనే ఎంటర్ టైన్ మెంట్ యాప్ లను పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ నిపుణులు నిర్వర్తిస్తున్నారని, మీరు ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ సమాచారం మొత్తం పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ గుప్పిట్లో ఉంటుందని వారు హెచ్చరించారు.