sbi bank: బ్యాంకుల ముందు పెరుగుతున్న ఘర్షణలు... పోలీసుల లాఠీఛార్జ్.. ఖాతాదారుల కొట్లాట!
బ్యాంకుల ముందు ఖాతాదారులకు తిప్పలు తప్పట్లేదు. నోట్ల కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు తీసుకునేందుకు ప్రజలంతా బ్యాంకుల ముందు చేరుతున్నారు. దీంతో పలు బ్యాంకుల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా వడమాలపేట ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఈ రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో ఈ రోజు బ్యాంకు వద్దకు ఖాతాదారులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకునేందుకు పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, ఖాతాదారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొనడంతో పోలీసులు ఖాతాదారులపై లాఠీఛార్జి చేశారు.
మరోవైపు విశాఖపట్నంలోని గోపాలపట్నం యూనియన్ బ్యాంక్ ఏటీఎం ముందు ఈ రోజు ఉదయం ఇద్దరు ఖాతాదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం కోసం లైన్లో నిల్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకొని అక్కడే కొట్టుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా స్వల్ప స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి.