trump: నాకు రష్యా సహాయం చేసిందన్న వార్తల్లో నిజం లేదు: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడానికి రష్యాకు చెందిన గూఢచారి సంస్థలు రహస్యంగా తోడ్పాటునందించాయని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన ట్రంప్ వాటిని ఖండించారు. ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సంబంధించిన కంప్యూటర్లను రష్యన్ ఏజెన్సీలు హ్యాక్ చేసి, ట్రంప్‌కు పరోక్షంగా సాయపడ్డాయని సీఐఏ తన నివేదికలో చెప్పింది. ఆమె ప్రచార బాధ్యతలు చేపట్టిన జానె పొడెస్టాకు సంబంధించిన పలు ఈ-మెయిళ్లు బయటపడడం హిల్లరీకి ఎన్నికల సమయంలో చిక్కుతెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ స్పందిస్తూ.. తనకు రష్యా ఏజెన్సీలు పరోక్షంగా ఉపయోగపడ్డాయన్న వార్తలను కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో విదేశీ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ఈ విషయంలో సీఐఏ తీరును కూడా ట్రంప్ తప్పుబట్టి ఆ వార్తలన్నీ అసత్యాలేనని తేల్చిచెప్పారు.