dog biryani: అప్పట్లో పిల్లి బిర్యానీ అమ్మారు.. ఇప్పుడు కుక్క బిర్యానీ!
చెన్నయి నగరంలో భోజనప్రియులు వికారానికి గురయ్యే మరో ఘటన వెలుగులోకొచ్చింది. కొన్ని రోజుల క్రితం చెన్నయ్‌లో పిల్లి బిర్యానీ అమ్ముతున్నారన్న నిజం బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా కుక్కమాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులు చూస్తోన్న బిర్యానీ ప్రియులకి వాంతు వచ్చినంత పనవుతోంది. సోషల్‌మీడియాలో వస్తోన్న ఈ వదంతులు నిజమా? కాదా? అని కనుక్కోవడానికి ‘పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా’ (పీఎఫ్‌సీఐ) నిర్వాహకులు చెన్నయ్‌లోని పలు హోటళ్లలో నిఘా ఏర్పాటు చేశారు.
ఇటీవల పీఎఫ్‌సీఐ నిర్వాహకులు చెన్నయ్‌లో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని వండి పెడుతున్నారని, రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నారని కనుగొన్నారు. అవి కూడా సోషల్‌మీడియాలో వచ్చిన ఫొటోల సాయంతోనే కనుగొన్నారు. ఇటీవలే బెంగళూరులోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. పీఎఫ్‌సీఐ రంగంలోకి దిగి నిజాన్ని తేల్చడంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఇప్పుడు చెన్నయ్‌లోనూ కుక్క మాంసం అమ్ముతున్నట్లు తేలితే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.