పరిపూర్ణమైన ఫలితాలనిచ్చే సూర్యారాధన

సాధారణంగా ఉదయాన్నే అంతా స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. పూజామందిరాన్ని అలంకరించి .. ఇష్టదేవతను పూజిస్తూ వుంటారు. పూజలో ఆ దైవానికి ఇష్టమైన పూలను ఉపయోగిస్తుంటారు ... ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఈ విధంగా అనునిత్యం చేసే దైవారాధన పుణ్య ఫలాలను ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే సూర్యభగవానుడిని ఆరాధిస్తూ చేసే పూజలు పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ప్రాచీనకాలంలో మహర్షులు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ... నమస్కరించడం చేసేవారు. ఈ రోజుల్లో కూడా ఉదయాన్నే సూర్యనమస్కారం చేసిన తరువాతనే తమ దైనందిన కార్యకలాపాలను ప్రారంభించేవాళ్లు ఎంతోమంది వున్నారు.

గ్రహాధిపతిగా చెప్పబడుతోన్న సూర్యభగవానుడు, లోకాలలో విహరిస్తూ ... వీక్షిస్తూ తన కరుణా కిరణాలను జీవకోటిపై ప్రసరింపజేస్తూ వుంటాడు. ఎంతోమంది దేవతలు ... మహర్షులు ఆ స్వామిని ఆరాధించి కావలసిన వరాలను పొందారు. 'సాంబుడు' వంటి వారు ఆ స్వామి అనుగ్రహంతో శాపాల నుంచి విముక్తిని పొందారు. శ్రీరాముడు ... శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు సైతం సూర్యభగవానుడిని పూజించారు.

సమస్త జీవకోటికి ప్రాణదాత ... ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడికి తప్పనిసరిగా అర్ఘ్యం సమర్పించాలి. ప్రత్యక్షనారాయణుడు అయిన ఆ స్వామికి అనుదినం నమస్కరించాలి. సూర్యభగవానుడిని అనునిత్యం ఆరాధించేవాళ్లు ఏ పూజ చేసినా దాని ఫలితం పరిపూర్ణంగా దక్కుతుందని చెప్పబడుతోంది. భక్తిశ్రద్ధలతో నమస్కారం సమర్పించినంత మాత్రాన్నే పాపాలను పటాపంచలు చేసి పుణ్యఫలితాలను అందించే సూర్యభగవానుడి ఆరాధనే సకలశుభాలను చేకూరుస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News