కష్టాలు తీర్చే కార్తీక దేవుడు
కోరిన కోరికలు నెరవేర్చడంలోను ... పుణ్య ఫలాలను అందించడంలోను కార్తీకమాసంతో సమానమైన మాసం మరొకటి లేదనేది మహర్షుల మాట. కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం వలన, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ మాసంలో అటు శివాలయాలకు .. ఇటు వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు.
అయితే సమానమైన ప్రాశస్త్యంగల శివ క్షేత్రం ... విష్ణు క్షేత్రం ఒకే ప్రాంతంలో ఆవిర్భవించడం అరుదుగా జరుగుతుంటుంది. అలా శివకేశవులు కొలువైన క్షేత్రాన్ని కార్తీకమాసంలో దర్శించడం వలన, పాపాలు పటాపంచలై సంపదలు ... సంతోషాలు కలుగుతాయని అంటారు. అలాంటి మహిమాన్వితమైన హరిహర క్షేత్రం, కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలోని 'అకిరిపల్లి' గా దర్శనమిస్తోంది.
హరిహరులు ఇక్కడ గల కొండపై కొలువుదీరి పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడ ఆవిర్భవించిన శివకేశవులకు వందల సంవత్సరాల చరిత్ర వుంది. పూర్వం 'శోభనాద్రి' అనే భక్తుడు హరిహరులను గురించి ఇక్కడ కఠోరమైన తపస్సును చేశాడట. అతని తపస్సుకు మెచ్చి వారు ప్రత్యక్షంకాగా, ఈ ప్రదేశంలో ఆవిర్భవించమని కోరాడు.
భక్తుడి అభ్యర్థనను కాదనలేని శివకేశవులు, నరసింహస్వామిగా ... మల్లేశ్వరుడుగా కొండపై వెలిశారు. శోభనాద్రి తపస్సు చేసిన కొండ అదే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడ గల పుష్కరిణి విష్ణుమూర్తి వరాహ రూపంలో తవ్వడం వలన ఏర్పడిందని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లోను ... కార్తీక మాసంలోను వివిధ ప్రాంతాల భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. హరిహరులను సేవిస్తూ పునీతులవుతుంటారు.