ఉమాలింగేశ్వర క్షేత్రం

మహాశివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి తన లీలావిశేషాలను చాటుతున్నాడు. శివతత్త్వం తెలుసుకున్న భక్తులు ఆయన ఆలయాలను నిర్మించి, మహాశివుడిని మనసారా ఆరాధిస్తున్నారు. అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో ఒకటిగా ఉమాలింగేశ్వర క్షేత్రం దర్శనమిస్తుంది. అత్యంత పవిత్రమూ ... మహా మహిమాన్వితము అయిన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా 'ద్వారపూడి' లో దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయ ముఖద్వారం కూడా శివలింగాకారంలోనే వుంటుంది. ఉమాలింగేశ్వరుడిగా చెప్పబడుతోన్న ప్రధాన శివలింగం, ఆలయ నిర్మాణ దాత అయిన భక్తుడికి ముందుగానే స్వప్నంలో సాక్షాత్కరించి ఆ తరువాత ఖాట్మండులో లభించిందని చెబుతారు. ఆ తరువాత ఆయన అనేక పుణ్య క్షేత్రాలను దర్శించి, అక్కడ లభించిన శివలింగాలను కూడా తీసుకు వచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడు.

ఈ ఆలయంలో నాలుగు అంతస్తులమేర కనిపించే శివలింగం కూడా వుంది. దాని మొదట్లో మిగతా శివలింగాలను అమర్చారు. ఒకేసారి అన్ని శివలింగాలు అభిషేకించబడుతూ ఉండటం విశేషం. ఇక ప్రధాన శివలింగం చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ దాని మహిమ అపారమని భక్తులు చెబుతుంటారు. గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది.

ఈ ఆలయ భూగర్భంలో ఒకే వేదికపై ప్రతిష్ఠించిన ద్వాదశ శివలింగాలను చూసితీరవలసిందే. శివరాత్రి పర్వదినం సందర్భంగా ... కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తుంటారు. ఉమాలింగేశ్వరుల అనుగ్రహంతో సుఖసంతోషాలను పొందుతుంటారు.


More Bhakti News