మోక్షమిచ్చే కాశి

కైలాసనాథుడైన శివుడు ప్రత్యక్షంగా కొలువుదీరిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రమే కాశీ. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే భారతీయులు ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడిని దర్శించాలని అనుకుంటారు. ఒకప్పుడు కాశీకి పోయినవాళ్లు ... కాటికి పోయినవాళ్లు ఒకటేననే మాట నానుడిగా వుండేది. అంటే వాళ్లు తిరిగిరావడం కష్టమేననే పరిస్థితి వుండేది. అప్పట్లో కాశీ ప్రయాణంలో అన్ని ఇబ్బందులు ... కష్టాలు ఉండేవన్నమాట.

అయినా బాధ్యతలు తీరడం ఆలస్యం చాలామంది కాశీకి బయలుదేరుతూ వుండేవారు. అందుకు కారణమేమిటంటే కాశీలో మరణించిన వారు మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతూ ఉండటమే. ఇక కాశీ వరకూ వెళ్లలేని పరిస్థితిలో వున్నవారు శ్రీశైల క్షేత్రానికి ప్రయాణం కట్టేవారు. శ్రీ శైలం యొక్క శిఖరాన్ని చూసిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటు శ్రీశైలం దర్శించుకున్నా ... అటు కాశీ ని దర్శించుకున్నా పునర్జన్మ ఉండదనే విషయాన్ని భక్తులు విశ్వసిస్తూ వస్తున్నారు. కాశీ కన్నా శ్రీ శైలం దగ్గర కదా అనే ఆలోచనతో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికే మొగ్గు చూపేవారూ లేకపోలేదు. ఇక అగస్త్య మహర్షితో కలిసి శ్రీ శైలం చేరుకున్న లోపాముద్ర కూడా ఇదే ఆలోచనను బయటపెట్టిందట.

శ్రీ శైలం శిఖరాన్ని చూడటం వలన కాశీలో మరణించే అవకాశాన్ని జీవుడు పొందుతాడనీ, కాశీలో మరణించడం వలన మోక్షం లభిస్తుందని అగస్త్య మహర్షి ఆమె సందేహాన్ని నివృత్తి చేశాడు. కాబట్టి శివ భక్తులకు రెండు కళ్లుగా చెప్పబడుతోన్న ఈ రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడం వలన పరిపూర్ణమైన ఫలితం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.


More Bhakti News