మండెం నృసింహస్వామి

నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం కడప జిల్లా చిన్న మండెం సమీపంలోని 'జల్లావాండ్ల పల్లె'లో అలరారుతోంది. మాండవ్య నదీ తీరంలో దర్శనమిస్తోన్న ఈ క్షేత్రానికి ఎంతో ప్రాచీన నేపథ్యం వుంది. మాండవ్య మహర్షి నివసించిన ప్రదేశం కనుక ఇక్కడి నదికి ఆ పేరు వచ్చింది. ఇక ఆయన కుమారులను పెద్ద మాండవ్యుడు ... చిన్న మాండవ్యుడు అని పిలిచే వారట. ఈ కారణంగానే పెద్ద కుమారుడు ఆశ్రమం ఏర్పరచుకున్న ప్రదేశానికి పెద్ద మండెం (చిత్తూరు జిల్లా ) అనే పేరు రాగా, చిన్న కుమారుడు ఆశ్రమం ఏర్పరచుకున్న ప్రదేశానికి చిన్న మండెం (కడపజిల్లా ) అనే పేరు వచ్చింది.
ఒకరోజున చిన్న మాండవ్యుడికి లక్షీ నృసింహస్వామి కలలో కనిపించి, తాను ఫలానా చోట ఉన్నట్టుగా చెప్పి తనని బయటికి తీసి ప్రతిష్ఠించమని అన్నాడు. దాంతో అతను ఊరి పెద్దలకి ఆ విషయం చెప్పి .. స్వామి వారు ఆదేశించిన ప్రకారం చేశాడు. ఈ కారణంగానే ఇక్కడి స్వామి 'మండెం లక్ష్మీ నృసింహస్వామి'గా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో చతుర్భుజుడైన స్వామివారు ... ఎడమ తొడపై లక్ష్మీదేవి తో దర్శనమిస్తారు.
విశాలమైన ఆలయ ప్రాంగణం ... అయిదు అంతస్తుల గాలి గోపురం ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి. మొదటి కుళుత్తోంగ చోళుడు వీటిని నిర్మించినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఆ తరువాత కాలంలో కూడా ఎంతోమంది రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. కాలక్రమంలో నిరాదరణకి గురైన ఈ క్షేత్రానికి, ఆనాటి వైభవాన్ని తిరిగి తీసుకు వచ్చే దిశగా గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తున్నారు.