శ్రీ ప్రసన్న వేంకటేశ్వర క్షేత్రం
వైకుంఠ నాథుడైన శ్రీమన్నారాయణుడు ... శ్రీనివాసుడిగా భూలోకంలోని తిరుమలలో తిరుగాడుచూ ఆ పరిసర ప్రాంతాలను ఎంతగానో ప్రభావితం చేశాడు. ఆ స్వామి పాద స్పర్శ కారణంగా ఇక్కడి కొండలు ... లోయలు ... వనాలు ... జలపాతాలు పరమ పవిత్రమయ్యాయి. తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన ఈ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువుదీరిన క్షేత్రం చిత్తూరు జిల్లాలోని 'అప్పలాయ గుంట'లో దర్శనమిస్తుంది.
శ్రీనివాసుడు 'నారాయణ వనం'లో పద్మావతీ దేవిని వివాహమాడిన తరువాత ఆమెతో కలిసి తిరుమలకు వెళుతూ, ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న 'సిద్ధేశ్వర మహాముని' ని కలుసుకున్నాడు. ఆ మహాముని తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు అమ్మవారితో సహా ఇక్కడ వెలిశాడు. తన భక్తుడి పట్ల స్వామివారు ప్రసన్నుడైన ప్రదేశం కనుక ఇక్కడి స్వామివారు 'ప్రసన్న వేంకటేశ్వరస్వామి'గా ప్రసిద్ధిచెందాడు.
16 వ శతాబ్దంలో కుమార వేంకటతిరుమలరాజు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసి తీరవలసిందే. అభయ హస్తంతో ఆజానుబాహుడిగా కొలువైన స్వామి మనోహరమైన రూపం మనసుపై మరిచిపోలేని ముద్ర వేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే పద్మావతి - ఆండాళ్ అమ్మవార్ల మందిరాలు కనిపిస్తుంటాయి. విశాలమైన ఇక్కడి కోనేరును 'పద్మ సరోవరం' అనీ ... 'అమృత సరోవరం' అని పిలుస్తుంటారు.
హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రానికి, శుక్ర - శనివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. రోజుకి తొమ్మిది ప్రదక్షిణలు చొప్పున తొమ్మిది వారాల పాటు ప్రదక్షిణలు చేసినట్టయితే, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో శ్రవణా నక్షత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వెంకన్న వైభవాన్ని కనులారా వీక్షిస్తూ పరవశిస్తుంటారు.