పంచముఖ శివ క్షేత్రం

'నమఃశివాయ'అనే పంచాక్షరీ మంత్రం సర్వ పాపాలను హరించి వేస్తుంది. అనంతమైన పుణ్య ఫలాలను అందజేస్తుంది. త్రిమూర్తులలో శివుడు ఉదార స్వభావానికి ఉదాహరణగా కనిపిస్తుంటాడు. ఈ కారణంగానే సురులు ... అసురులు కూడా ఆయన ద్వారా ఎక్కువ వరాలను పొందారు. భక్తితో ... ఆర్తితో పిలిచినంతనే పలికే శంకరుడు, సర్వ శుభంకరుడిగా ఎన్నో క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి విశిష్ట క్షేత్రాలలో ఒకటిగా 'తాళ్లయ్య పాలెం' కనిపిస్తుంది.

ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గుంటూరు జిల్లాలో దర్శనమిస్తోంది. కోటి శివలింగాలను రూపొందించి ప్రతిష్ఠించడం వలన ఇక్కడి స్వామిని 'కోటి లింగేశ్వర స్వామి' గా పిలుస్తుంటారు. గర్భాలయంలో స్వామి అయిదు ముఖాలతో దర్శనమిస్తుంటాడు. ఇక ఈ క్షేత్రంలో సిద్ధి-బుద్ధి సమేతంగా వినాయకుడు కొలువుదీరి కనిపిస్తుంటాడు. ఆ పక్కనే ఆలయానికి చెందిన 'గోశాల' దర్శనమిస్తుంటుంది. భక్తులు ముందుగా గణపతిని దర్శించుకుని ... ఆ తరువాత గోమాతను పూజించి ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు.

ఏ క్షేత్రంలోనైనా నవగ్రహాలకు ఒకే మంటపం కనిపిస్తుంది. కానీ ఇక్కడ నవగ్రహాలు ఒక్కొక్కటిగా తమ వాహనాలతో సతీసమేతంగా ప్రత్యేక మందిరాలలో కొలువై ఉండటాన్ని విశేషంగా చెబుతుంటారు. ఇక 'నక్షత్ర వనం'లో నక్షత్ర పరమైన దోషాలు తొలగించుకునే ఏర్పాట్లు వున్నాయి. ఇక్కడి 'ప్రత్యంగిరాదేవి' ఆలయం చూడదగినది. అమ్మవారు 64 అంశాలతో ... 64 త్రిశూలాలతో ... అష్టభైరవులతో దర్శనమిస్తుంటుంది.

ఇక్కడి శ్రీ చక్రంపై పౌర్ణమి రోజున పడే వెన్నెల కిరణాలను చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన దుష్ట శక్తుల బారి నుంచి విముక్తి కలగడమే కాకుండా, కార్య సిద్ధి కలుగుతుందని చెబుతుంటారు. ... మహా శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.


More Bhakti News