శృంగేరి శారదామాత

'శృంగేరి' పేరు వినగానే పవిత్రమైన భావం కలుగుతుంది. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఇక్కడ శారదామాతను ప్రతిష్ఠించిన కారణంగా, ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా అలరారుతోంది. స్థల మహాత్మ్యం విషయానికి వస్తే ... పూర్వం విభాండక మహర్షి కుమారుడైన 'రుష్య శృంగుడు' తపమాచరించిన ప్రదేశం కావడంతో, ఈ ప్రదేశానికి 'శృంగగిరి' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది 'శృంగేరి' గా మార్పుచెందింది.
కర్ణాటక రాష్ట్రంలో సహ్యాద్రి పర్వత సానుల్లో 'తుంగభద్ర' నది సమీపంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. జ్ఞానయాత్రలో భాగంగా తన శిష్యులతో కలిసి శంకరాచార్యుల వారు, ఈ ప్రదేశానికి వచ్చాడు. ఆ సమయంలో ఒక పాము ... కప్ప సఖ్యతగా ఉండటం చూసిన ఆయన, ఇది మహిమాన్వితమైన క్షేత్రమని గ్రహించాడు. నాలుగు వేదాలకు ప్రతీకగా తాను నిర్మించాలనుకున్న నాలుగు మఠాలలో, శారదా పీఠాన్ని స్థాపించడానికి ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్నాడు. అలా శంకరుల వారు శారదామాతను ఇక్కడ ప్రతిష్ఠించారు.
గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో సర్వాలంకార భూషితంగా దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారు జ్ఞానంతో పాటు సకల సంపదలను ... ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు 'చంద్రమౌళీశ్వర స్వామి' స్పటిక లింగాన్ని కూడా శంకరుల వారు ప్రతిష్ఠించారు. సాక్షాత్తు మహా శివుడే ఆది శంకరుల వారికి ఈ శివలింగాన్ని ఇచ్చాడని అంటారు. ఈ కారణంగా ఇక్కడి శివుడిని దర్శిస్తే ఆయనను ప్రత్యక్షంగా పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు.
తుంగభద్రా నదీ తీరంలో ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే సుబ్రహ్మణ్యే శ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే 'దత్త పీఠం' కనిపిస్తుంది. దత్తాత్రేయుడు లింగాకారంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. 'శృంగేరి' లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శక్తి స్వరూపిణి అవతారమైన అమ్మవారిని పూజించి పునీతులవుతుంటారు.