శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలలో శ్రీకృష్ణావతారం ... పరిపూర్ణావతారంగా చెప్పబడింది. చిన్ని కృష్ణుడిగా ... చిలిపి కృష్ణుడిగా ... రాధా కృష్ణుడిగా ... కురుక్షేత్ర యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించిన శ్రీ కృష్ణుడిగా ఆయన తన లీలా విశేషాలను ఆవిష్కరించాడు. ప్రతి దశలోను శ్రీ కృష్ణుడు తనని నమ్మినవారి సందేహాలను తీరుస్తూ, సందేశాలు ఇస్తూ అవతార పురుషుడిగా అద్భుతాలు చేశాడు.
అలాంటి శ్రీ కృష్ణుడు ... వేణుగోపాలుడిగా పూజలందుకుంటోన్న క్షేత్రం చిత్తూరు జిల్లా 'కార్వేటి నగరం'లో దర్శనమిస్తుంది. శేషాచల పర్వత శ్రేణుల పాదభాగంలో నెలకొని వున్న ఈ క్షేత్రం ప్రాచీన ప్రాభవానికి అద్దం పడుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామికి మావగారైన ఆకాశరాజు వంశానికి చెందిన 'వేంకట పెరుమాళ్' ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి.
విశాలమైన ఆలయ ప్రాంగణం ... ఎత్తైన రాజగోపురం ... శిల్ప కళా వైభవం వేంకటపెరుమాళ్ అభిరుచిని ఆవిష్కరిస్తూ వుంటాయి. ఆ తరువాత కాలంలో చోళులు ఇక్కడ విశాలమైన కోనేరును ఏర్పాటు చేశారు. గర్భాలయంలో వేణుగోపాలుడు ... రుక్మిణీ -సత్యభామలతో కొలువై కనిపిస్తుంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో కోదండరామ స్వామి మందిరం ... ప్రసన్నాంజనేయ స్వామి మందిరం ... మహాలక్ష్మి మందిరం కొలువుదీరి వుంటాయి.
ప్రతియేటా వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా ... చారిత్రక పరంగా విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షమై అలరారుతోంది.