సురుటుపల్లి

శైవ క్షేత్రాలలో 'సురుటుపల్లి'కి ఓ ప్రత్యేకత ... ప్రాధాన్యత ఉన్నాయి. సాధారణంగా లింగాకారంలో సాక్షాత్కరించే శివుడు ఈ క్షేత్రంలో 'శయనమూర్తి'గా కనిపిస్తుంటాడు. ఇక గర్భాలయంలో పార్వతీ అమ్మవారితో పాటు బ్రహ్మ ... విష్ణువు ... సప్తరుషులు కొలువుదీరి వుండటం మరో విశేషం. మహిమాన్వితంగా కనిపించే ఈ క్షేత్రం ... చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో అలరారుతోంది. శివుడికి బదులుగా నందీశ్వరుడు కొన్ని ఘడియల పాటు లయకారకుడిగా వ్యవహరించిన కారణంగానే ఈ క్షేత్రంలో శివుడితో పాటు నందీశ్వరుడికి అభిషేకాలు జరుగుతుంటాయని చెబుతుంటారు. ఈ క్షేత్రం ఆవిర్భవించిన తీరు మనకి 'స్కాంద పురాణం'లో కనిపిస్తుంది.

దేవదానవులంతా కలిసి క్షీరసాగరాన్ని మథించగా అందులోనుంచి హాలాహలం పుట్టింది. శివుడు ఆ హాలాహలాన్ని మింగినపుడు అది కంఠం దిగి వెళ్లకుండా పార్వతీదేవి అదిమి పట్టింది. ఫలితంగా ఆ కాలకూట విషం శివుడి గొంతులోనే ఆగిపోయి కంఠం నీలం రంగులోకి మారిపోయింది. ఆ విష ప్రభావం కారణంగా శివుడు కొన్ని ఘడియల పాటు సొమ్మసిల్లి అమ్మవారి ఒడిలో వాలిపోయాడట. అలా అమ్మవారి ఒడిలో అయ్యవారు వాలిపోవడం ( పడుకుని ఉండటం) తమిళంలో 'పళ్లి కొండటం' అంటారు. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని 'పళ్లి కొండేశ్వర స్వామి' అని పిలుస్తూ వుంటారు.

స్వామిని చూడటానికి దేవతలంతా తరలి రావడంతో ఈ ప్రదేశానికి సురులపల్లి అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది సురుటుపల్లిగా మార్పు చెందింది. అయితే శివుడు సొమ్మసిల్లి పడిపోయిన 'కృష్ణ పక్ష త్రయోదశి' శనివారం నాటి ప్రదోష కాలంలో కొన్ని ఘడియల పాటు నందీశ్వరుడు లయ కారకుడిగా వ్యవహరించినట్టు 'శివపురాణం'లో కనిపిస్తుంది. అందుకు నందీశ్వరుడిని అభినందించిన శివుడు, ఆ క్షేత్రంలో తనతో పాటు అతనికి కూడా అభిషేకాలు జరిగేలా వరం ఇచ్చాడని అంటారు.

ఇక త్రేతాయుగంలో శ్రీరాముడు ... లవ కుశులు ... వాల్మీకి మహర్షి ఇక్కడి స్వామివారిని దర్శించినట్టు స్థలపురాణం చెబుతోంది. వాల్మీకి మహర్షి పూజించిన కారణంగానే ఈ స్వామివారిని 'వాల్మీకేశ్వరుడు' అని కూడా పిలుస్తుంటారు. పురాణాల్లో ఒక మహాద్భుతమైన ఘట్టానికి అద్దం పడుతున్నట్టుగా కనిపించే ఈ క్షేత్రం ... మోక్షానికి మొదటి మార్గంగా అనిపించడం సహజం.


More Bhakti News