భీమశంకరం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 'భీమశంకరం'ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మహారాష్ట్ర - పూనా సమీపంలో భీమారధీ నదీ తీరాన సముద్రమట్టానికి 4000 కిలోమీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణిలో వెలసింది. ఈ ప్రదేశంలో భీమాసురుడనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రం భీమశంకరంగా పిలవబడుతోంది. కర్కటి అనే రాక్షస స్త్రీకి ... రావణుడి సోదరుడైన కుంభకర్ణుడికి జన్మించినవాడే భీమాసురుడు.
శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుడి చేతిలో తన వాళ్లు హతం కావడంతో, శ్రీహరిపై ప్రతీకారం తీర్చు కోవాలని భీమాసురుడు నిర్ణయించుకున్నాడు. వరబల గర్వంతో పాతాళ లోకంపై దండెత్తి, శివభక్తులైన రాజ దంపతులను బంధించాడు. తమని రక్షించవలసిందిగా ఆ దంపతులు అక్కడి శివలింగాన్ని ప్రార్ధించారు. ప్రాణంలేని ఆ రాయి వారిని రక్షించలేదంటూ దానిని తన ఖడ్గంతో ముక్కలు చేయడానికి సిద్ధపడ్డాడు.
శివలింగాన్ని ఆ ఖడ్గం తాకినంతనే అందులోనుంచి రుద్రుడు ఒక్కసారిగా బయటికి దూకాడు. ఊహించని ఈ సంఘటనకి భీమాసురుడు బిత్తరపోయాడు. తన భక్తులను బాధించినందుకు ఫలితం అనుభవించక తప్పదంటూ శంకరుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. భీమాసురుడు ప్రాధేయపడటంతో అతని పేరునే ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందని శంకరుడు అనుగ్రహించాడు. ఈ కారణంగా ఈ క్షేత్రం 'భీమశంకరం'గా పిలవబడుతోంది.
ఇక భీమాసురుడుతో పోరాడటం వలన శివుడు అలసి పోయి ఇక్కడి పర్వతంపై కూర్చున్నప్పుడు జాలువారిన చెమట బిందువులే భీమారధీ నదిగా మారాయని అంటారు. పూర్వం దట్టమైన ఈ అరణ్య ప్రాంతం 'డాకిని'అనే రాక్షసి ఏలుబడిలో వుండేది కాబట్టి, డాకిన్యాం భీమశంకరం అని ఆది శంకరుల వారు స్తుతించారు. గర్భాలయంలో వెలసిన స్వామివారిని స్వయంగా అభిషేకించవచ్చు. ఆ పక్కనే అమ్మవారు కమలజాదేవి పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది.
ఎంతోమంది మహనీయులు ... రాజ వంశీకులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించినట్టు ఆధారాలు వున్నాయి. ఈ దేవాలయంలో వేలాడే భారీ గంట ప్రాచీనకాలం నాటిది. ఈ గంటను మోగించడం ఇప్పటివారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మోగించగలిగితే మాత్రం ఆ ప్రాంతమంతా ఓంకారం ప్రతిధ్వనిస్తుందని చెబుతుంటారు.