సర్వ దోషాలను తొలగించే నాగపూజ
ప్రాచీనకాలం నుంచి మన దేశంలో నాగులను పూజించే ఆచారం వుంది. అందువల్లనే గ్రామీణ ప్రాంతాల్లో చెట్ల క్రింద వుండే పుట్టలను పూజిస్తుంటారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో వుండే నాగ ప్రతిమలను ఆరాధిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో 'శ్రావణ శుద్ధ చవితి' రోజున 'నాగుల చవితి' పర్వదినాన్ని జరిపితే, మరికొన్ని ప్రాంతాల్లో 'కార్తీక శుద్ధ చవితి' రోజున జరుపుతుంటారు.
స్త్రీలంతా కూడా ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. నూతన వస్త్రాలను ధరిస్తారు. ఉపవాస దీక్షను చేపట్టి, దగ్గరలోని పుట్ట దగ్గరికి వెళ్లి దానిలో పాలు పోస్తారు. సువాసన గల పూలతో నాగపూజ చేసి, నువ్వుల పిండిని .. చలిమిడిని .. వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో నాగపూజ చేయడం వలన, సర్ప భయంతో పాటు, సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కళ్లకు .. చెవులకు .. చర్మానికి సంబంధించిన వ్యాధులు దరిచేరవని అంటారు. అందువలన 'నాగుల చవితి' రోజున నాగదేవతను పూజించే అవకాశాన్ని వదులుకో కూడదు.