సఖ్యతను చాటే బతుకమ్మ

తెలంగాణలో జరుపుకునే పెద్ద పండుగలలో 'బతుకమ్మ' ఒకటి. ఈ పండుగలో స్త్రీలు విశేషంగా పాల్గొంటూ వుంటారు. ఈ పండుగ స్త్రీల మధ్య .. తద్వారా కుటుంబాల మధ్య సఖ్యతను చాటుతూ ఉంటుంది. అంతా కలిసి వివిధ రకాల పూలను సేకరించడం .. ఆ పూలను కలిసి అందంగా పేర్చడం చేస్తుంటారు.

'బతుకమ్మ'కి పేర్చే పూలలో అన్నీ కూడా ఖరీదైనవి కాకుండా సామాన్యమైన పూలు .. సాధారణమైన పూలు కనిపిస్తుంటాయి. సామాన్యులు సైతం జరుపుకోవడానికి వీలుగా ఈ పండుగ ఉంటుంది. బతుకమ్మకి ఆలయమంటూ ఉండదు .. స్త్రీల మనసులోనే ఆమె కొలువై ఉంటుంది. బతుకమ్మను పూజించడానికి ఎలాంటి మంత్రాలు వుండవు .. స్త్రీలంతా కలిసి పాడుకునే పాటలే మధురమైన మంత్రాలు.

మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఎక్కడ చూసినా ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. మొదటి రోజున 'ఎంగిలి బతుకమ్మ' .. రెండో రోజున 'అటుకుల బతుకమ్మ' .. మూడో రోజున 'ముద్దపప్పు బతుకమ్మ' .. నాల్గోరోజు 'నాన బియ్యం బతుకమ్మ' .. ఐదో రోజు 'అట్ల బతుకమ్మ' .. ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ' .. ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ' ఎనిమిదో రోజు 'వెన్నముద్దల బతుకమ్మ' .. తొమ్మిదో రోజు 'సద్దుల బతుకమ్మ'ను తయారు చేసి ఆటపాటలతోనే ఆరాధిస్తారు. బతుకమ్మలను నీళ్లలో వదిలి వాయినాలు ఇచ్చుకుంటారు.


More Bhakti News