సజ్జన సాంగత్యానికి మించినది లేదు

ఎప్పుడూ సజ్జన సాంగత్యం చేస్తూ వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సజ్జన సాంగత్యం జీవితాన్ని ప్రశాంతమైన మార్గంలో నడిపిస్తుందని అంటున్నాయి. సజ్జనులు మంచి మాటలు చెబుతారు .. మంచి మార్గం చూపిస్తారు. జీవితంలో వేటిని పట్టుకోవాలో .. ఎలాంటి వాటిని విడిచి పెట్టాలో సూచిస్తారు.

సజ్జనులు ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తుంటారు .. వివిధ క్షేత్రాలను దర్శిస్తుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. పూజలకి .. భజనలకి ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఇతరులకి ఎలాంటి హాని చేయకుండా .. తమకి చేతనైనంత సాయం చేస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం వలన, ఆ మార్గంలో నడవటం సహజంగానే అలవడుతుంది.

అందుకే మహానుభావులు ఒక మాట చెబుతుంటారు. సజ్జనులతో సహవాసం, పరిమళ ద్రవ్యాల దుకాణాన్ని సందర్శించడం వంటిది. పరిమళ ద్రవ్యాలను కొన్నా .. కొనకపోయినా ఆ వాసన అంటుకుని తీరుతుంది. సజ్జన సాంగత్యం జీవితానికి ఉత్తమమైన మార్గం చూపిస్తుంది కనుక, ఎలాంటి పరిస్థితుల్లోను అలాంటి వారిని వదులుకోకూడదు.


More Bhakti News