ఆరోగ్యాన్నిచ్చే ఆంజనేయుడు
బాల్యంలోనే సమస్త దేవతల ఆశీస్సులను పొందినవాడు ఆంజనేయుడు. ఆయన చిరంజీవి కావడం వలన భక్తులను రక్షించడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుంటాడని చెబుతుంటారు. తన భక్తుల ఆర్తి చెవిన పడిన వెంటనే ఆయన వారిని ఆదుకుంటూ ఉంటాడని అంటారు. అందువల్లనే హనుమంతుడి ఆలయాలు ఎక్కడ వున్నా భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి హనుమంతుడు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి నిజామాబాద్ జిల్లా 'సారంగపూర్'లో దర్శనమిస్తుంది.
ఇక్కడి స్వామివారి మూర్తిని చూస్తే ఆనందంతో పాటు ఆశ్చర్యం కలగక మానదు. అంతటి భారీ రూపంలో స్వామివారు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని శివాజీ మహారాజు గురువైన సమర్ధ రామదాసు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ప్రతి మంగళ .. శని .. ఆది వారాల్లోను ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహా తేజస్సును కలిగిన స్వామివారిని దర్శించుకోవడం వలన ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.