సుందరమూర్తి స్వామిని దర్శిస్తే చాలు
పరమశివుడు .. పార్వతీదేవితో పాటు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో 'తిరుమనంచేరి' ఒకటిగా కనిపిస్తుంది. తమిళనాడు - తంజావూరులోని 'కుట్టాలం' పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. పార్వతీ పరమేశ్వరుల వివాహం ఈ ప్రదేశంలోనే జరిగిందని స్థల పురాణం చెబుతోంది. స్వామివారిని కల్యాణ సుందర మూర్తి అనీ .. అమ్మవారిని కోకిలాంబాళ్ పేర్లతో కొలుస్తుంటారు.
వీరి వివాహానికి సప్త సముద్రాలలోని నీరు వచ్చి ఇక్కడ తీర్థంగా ఏర్పడిందని అంటారు. అందుకే ఇక్కడి తీర్థానికి 'సప్త సాగర తీర్థం' అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకి కోరిన వరాలు దక్కుతుంటాయి. ముఖ్యంగా వివాహం విషయంలో ఆలస్యమవుతున్నవాళ్లు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడ స్వామివారికి .. అమ్మవారికి పూజ చేయించి .. పూల దండలు సమర్పిస్తే, వివాహం విషయంలో దోషాలు తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతుంటారు. అలా వివాహం జరిగిన తరువాత మొక్కుబడులు చెల్లించే దంపతులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.