అందుకే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది
గుంటూరు జిల్లాలోని ప్రాచీన క్షేత్రాలలో 'కాకాని' ఒకటిగా కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 'మల్లేశ్వరుడు' కొలువై దర్శనమిస్తుంటాడు. ఇక్కడ స్వామి మల్లేశ్వరుడుగా పిలువబడుతుండటం వెనుక .. ఈ క్షేత్రానికి 'కాకాని' అనే పేరు రావడం వెనుక ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం భరద్వాజ మహర్షి ఈ ప్రదేశానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నాడు. అనునిత్యం స్వామిని మల్లెపూలతో పూజించించాడు. అందువల్లనే ఇక్కడి స్వామివారిని మల్లేశ్వరుడు అని పిలుస్తుంటారు. ఇక ఈ ప్రదేశంలోనే 'కాకాసురుడు' అనే రాక్షసుడికి భరద్వాజ మహర్షి శాప విమోచనాన్ని కలిగించాడు. అందువలన ఈ ప్రదేశానికి 'కాకాని' అనే పేరు వచ్చిందని చెబుతారు. పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త పాపాలు నశించి పుణ్య ఫలాలు చేకూరుతాయని అంటారు.