అభయాన్నిచ్చే సాయినాథుడు
శిరిడీలో సాయిబాబా నివసించే రోజుల్లోనే ఆయన మహిమలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. అయితే ఆయన ఎప్పుడూ కూడా కావాలని తన మహిమలు చూపలేదు. భక్తులను ఆదుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలే .. లీలా విశేషాలుగా మారాయి. తనని విశ్వసించే భక్తులు ఎక్కడ .. ఎలాంటి పరిస్థితుల్లో వున్నా, వాళ్లని గట్టెక్కిస్తూ వచ్చాడు. అందువల్లనే భక్తులు తమ గ్రామాల్లో .. కాలనీలలో ఆయన ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు.
అలా భక్తుల సంకల్పం కారణంగా నిర్మించిన బాబా ఆలయాలలో ఒకటిగా, 'వట్టిపర్తి' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి దగ్గరలో ఈ ఆలయం కనిపిస్తుంటుంది. సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడిన ఆలయంలో బాబా అభయాన్నిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు.
ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయానికి గ్రామస్తులతో పాటు, ఆ మార్గంలో ప్రయాణించే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. బాబా దర్శనం వలన మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, ఆపదలు .. ఆటంకాలు తొలగిపోతాయని చెబుతుంటారు.