కోరిన వరాలనిచ్చే లక్ష్మీదేవి
లక్ష్మీదేవి కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'కొల్హాపురి' అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. మహారాష్ట్రలోని ఈ క్షేత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసంగా చెప్పుకుంటారు. అమ్మవారు ప్రత్యక్షంగా కొలువైన దివ్య క్షేత్రంగా విశ్వసిస్తూ ఆరాధిస్తుంటారు. ఎంతోమంది మహర్షులు .. మహారాజులు .. మహా భక్తులు అమ్మవారిని సేవించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
లక్ష్మీదేవి ఆరాధన దారిద్ర్యాన్ని నశింపజేసి .. సిరి సంపదలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన సిరి సంపదలను ప్రసాదించడంతో పాటు, మనసులోని ధర్మబద్ధమైన కోరిక ఏది అమ్మవారి ముందుంచినా అది తప్పక నెరవేరుతుందని చెబుతుంటారు.
ఈ క్షేత్రంలో శ్రీచక్రాన్ని పూజించడం వలన సంతాన భాగ్యం లభిస్తుందనీ .. దీపం వెలిగించడం వలన జ్ఞానం లభిస్తుందనీ .. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన, సమస్త సమస్యలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఒకసారి అమ్మవారిని దర్శించిన భక్తులపై ఆ తల్లి చూపు ఎప్పటికీ ఉంటుందని అంటారు. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేవారిని అమ్మవారు ఎప్పటికీ అంటిపెట్టుకుని ఉంటుందని చెబుతారు.